ఒకో ఘటనకు
ఉప్పొంగి హిమాలయ శిఖరాన్ని తాకే
ఓ చిన్ని సరస్సు
మరొక మాటకు మరొక ఘటనకు
నులి వెచ్చగా విచ్చుకునే ప్రాత: కమలము
చల్లని కిరణాలు వెదజల్లే
ఓ శరత్ చంద్రిక
మరొక మాటకు మరొక ఘటనకు
ప్రతిఫలనం చెందే ఓ గాజు ఫలకం
దూది పింజలా ఆకసాన తేలే
ఓ మబ్బుతునక
మరొక మాటకు మరొక ఘటనకు
స్వప్న లోకంలో విహరించే
ఓ స్వర్ణ విహంగం
మరొక మాటకు మరొక ఘటనకు
చిలిపిగా తాకి హాయిని కలిగించే
ఓ గాలి తెమ్మర
మరొక మాటకు మరొక ఘటనకు
ప్రకృతి అందాలు ఆస్వాదించే
ఓ రసజ్ఞ భ్రమరం
మానవత్వం ముంగిట మోకరిల్లే
ఓ కృతజ్ఞతా కుసుమం
మరోక మాటకు మరొక ఘటనకు
ప్రత్యూష సౌజన్యంతో ఎరుపెక్కే
ఓ అరుణా౦బరం
మరొక మాటకు మరొక ఘటనకు
జడివాన వెలిసాక ఉదయించే
ఓ రంగుల హరివిల్లు
మరొక మాటకు మరొక ఘటనకు
మేఘమాల చిరుజల్లు చల్లితే
పులకరించే అవని శోభ
మరొక మాటకు మరొక ఘటనకు
విరహ గీతం ఆలపించే
ఓ మౌనవీణ
మరొక మాటకు మరొక ఘటనకు
జయాన్ని ఒసగే చిన్నారి
విజయలక్ష్మి చిద్విలాసం
మరొక మాటకు మరొక ఘటనకు
ఆశల మామిడి కొమ్మను అల్లుకునే
మృదులమైన ఓ మాధవీలత
మరొక మాటకు మరొక ఘటనకు
అనురాగం అందించే ఓ అందాల అనురాధ
మరొక మాటకు మరొక ఘటనకు
వసంతుని లోగిలిలో విరిసిన
అమాయకపు కుసుమ ముగ్ధ
ఓ స్నిగ్ధ సీత
ఇంతకీ ఏమిటది?
నా హృదయారవిందము
అందుకున్న వారికి మధురానందము
పొందలేని వారికి విరహానందము
ఎవ్వరికైనా ఆనందాన్ని ఒసగే
నా మది పుష్పము
దేవా నీకే సమర్పితము
నా హృదిని నిలుపుకున్నా
నీ చరణారవిందములు