కడలి కెరటం కపోతమై
నింగికెగసిన స్వేచ్చాస్వాతంత్రం
సూన్యాకాశ రహస్యాలను
ఛేధి౦చాలనే మనో నిశ్చయం
నింగి చిత్రపటంపై ఎన్ని రంగుల విచిత్రాలో
నేల ముగ్గులలో ఎన్నెన్ని అందాలో
నింగి నేల కలవని సృష్టి విలాసాలు
అయినా అందుతున్న మౌన సందేశాలు
రె౦టినీ కలవకనే కలుపుతున్న
కందర్పుని కడగండ్ల
వారధులు ఇంద్రధనస్సులు
కన్నీటి చిరుచినుకున ప్రతిఫలనం చెందే
చిరునవ్వు మయూఖములు
మానసాన మెరిసే
మృదు మధురోహల దోబూచులు
క్షితి మానసాన చిగురించిన
వలపు వాగు వయ్యారి పరుగులు
ఉప్పెనై సాగు అందెల రవళులు
సంతోష సాగరానికై సాధనా యత్నాలు
అ౦బరా౦బుధిలో మెరిసి విరిసి పిలిచే
విద్యుల్లతా పుష్పమాలికలు
నిజము చెప్పని నింగి నీవై
అసత్యమాడని ఆకసము నీవై
లౌక్యమా ఏమి నీ గమ్యం
ఎటు కేసి నీ జీవిత గమనం
సత్యా సత్యాలు ఒకటైన
విచిత్ర వైనం
మౌనమానస పవన తరంగమై
హృదిని మీటే గతిని శాసించే
అజ్ఞాత ఆలాపనలు
తపించిన తమస్సులై తరించిన తపస్సులై
భువి చేరని దివియై ముంగిట శ్వేత గులాబీలై
ఎన్నో అందాలని ఎన్నెన్నో నవ్వుల నందనవనాలని
మరెన్నో ఆనందాలని ప౦చుతూ
మానసా౦బరాలేన్నిటినో తారా కాంతితో అల౦కరిస్తున్న
ప్రతి హృదికి ఈ గీతాంజలి విద్యుల్లతాంజలి
మేను తాకీ తాకని స్పర్శ
కా౦క్షను తాకుతుంటే
అనంగుని ఆక్రందనలు
వినిపి౦చీ కనిపి౦చని
మాయా భరిత ఎండమావుల అంకుశాలు
ఆర్తిభరిత వ్యథాకళిత ఎడారి పిలుపులు
అంబరాన మేఘమాల అలజడి అలలు
అంబుధిలో ప్రతిబించు మెరుపు తీగలు
ఆకసాన పయనించు మబ్భు తునకలు
భువిని పులకరించు వర్షాక్షితలు
ఆకసాన పయనించు మబ్భుమంచు శిఖరాలు
కడలి ఒడిలో పోదువుకున్న
పచ్చని ప్రాకృతిక ధరణి ద్వీపాలు
నీలి నింగి కొలనులో సుధా౦శుని చిద్విలాసం
నేల నిశీధిలో కుసుమ పరాగం
ఆకసాన అమర్చిన తారా తోరణం
ధాత్రి గర్భాన రత్నరంజిత కోశాగారం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి