గురుశిష్యో భ్యో నమః
ఓం సహనా వవతు సహనౌ భునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై
ఓం శాంతి : శాంతి : శాంతి :
బ్రహ్మ మన ఇరువురినీ రక్షించు గాక
మన ఇరువురను పోషించు గాక
ఇరువురం శక్తి మంతులం అవుదుము గాక ....
అని గురు శిష్యుల మధ్య పరస్పర శ్రేయోకామన
పరస్పర శ్రద్ధ అవసరం
ఈ జ్ఞాన ప్రక్రియ అంతా ఓ దానమో ఒక స్వీకరణో కాదు
మహోదాత్తమైన యజ్ఞమందు ఇచ్చేవారిలో పుచ్చుకునే వారిలో కూడా
ఆ యజ్ఞానికి ఆత్మార్పణే సమిధలుగా సమర్పించే అంకిత భావం ఉండాలి
గురు శిష్యుల మధ్య అనుబంధం అవగాహన అనుసంధానం లేనట్లయితే
ఒకరి మనోభావన అవతలి వారి హృదయాన్ని స్పృశించదు
మనసులోనుంచి రాని విద్య అవతలి వారి మనసును తాకని విద్య
అభ్యాసం అవుతుందే కాని అధ్యయనం కాదు
జ్ఞానం ధారయామిగా జ్ఞాన దాన యజ్ఞం చేయాలి
అలా చేసిన వాళ్ళే ఋషులు
జ్ఞాన బోధనకు కుటుంబ సమేతంగా అంకితమై
జ్ఞాన ధారను తమ ధ్యానధారగా సాధన చేసి
తరించి పోయింది ప్రాచీన గురు గణం
ఆ శిష్య గణం మరో తరానికి అందించేందుకు
పరిపూర్ణ సమర్థతను ప్రోగు మరియు ప్రోది చేసుకుంటుంది
జ్ఞానం ఐకమత్యానికి అజ్ఞానం వైవిధ్యానికి దారి
తీస్తుందంటారు శ్రీ రామకృష్ణులు తామిద్దరి మధ్య
వైవిధ్యాన్ని తొలగించి ఐకమత్యాన్ని కలిగించడమన్నదే
శాంతి పాఠంలోని ప్రార్థన
అప్పుడే ఒక దీపం నుంచి మరో దీపం వెలిగినట్లుగా
గురు శిష్యుల సమరస సామరస పరస్పర సహకారం
శ్రద్ద గౌరవాల ఉదాత్త మార్పిడి గురు శిష్యుల సమిష్టి
ఉద్యమంగా భాసిల్లి జ్ఞానం వ్యాపించి లోకాన్ని
జ్యోతిర్మయంగా చేస్తుంది
గురువు శిష్యుడికి ఫలాన్ని అందిస్తే దాన్ని ప్రసాదంగా
ప్రపంచానికి వితరణ చేస్తాడు శిష్యుడు
ప్రారంభం దశలో గురువనే హిమవన్నగ శృంగాన్ని
తెరిపార చూడటం కూడా శిష్యుడికి సాధ్యం కాదు
అది గ్రహించే జ్ఞాన భాస్కరుడైన గురువు శిష్యుడితో
ఏకాత్మగా స్థితుడై భేషజం లేకుండా అభేధ భావన
చేస్తే తప్ప మమేకం కాలేమని ద్వేషరాహిత్యాన్ని శక్తి
సముపార్జనను కోరుతూ శిష్య సహితంగా
శాంతి ప్రార్థన చేస్తున్నాడు గురువు
ఓం తస్మై శ్రీ గురవే నమః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి