29, ఆగస్టు 2023, మంగళవారం

Naana ....Nenu

                                                     నాన్న - నేను 


అందరూ మాతృదేవో భవ అంటూ తల్లినే శ్లాఘిస్తారు 

నవమాసాలు మోసేది తల్లి కాని 

ఆ నవ మాసాలు ఆ తల్లి తో బాటు తన బిడ్డను కాపాడుకునే 

పోషించే తండ్రిని అందరూ దాదాపు మరిచిపోతారు 


అమ్మ కమ్మని మాట మరి  

నాన్న ప్రేమ నిండిన మూట అనురాగపు బాట 

మృత్యువు అమ్మని దూరం చేస్తే 

విధి నాన్నని దూరం చేసింది 


దాదాపు పదేళ్లు నాన్న దగ్గర లేకపోయినా 

అతను నేర్పిన ఎన్నో విలువలు 

నన్ను ముందుకు నడిపించాయి 

నాన్న ఒక మహావృక్షం 

నాన్న మహామనిషీ ఎంతో సాధించాడు 

ఇలా చెప్పుకోవడానికి  ఏమి లేవు కాని 

తన ఉద్యోగ నివృత్తిలో ఎంతో 

నిజాయితీ పరిపూర్ణత చూపించాడు

నాన్నని చూసి అతని ప్రవర్తన ద్వారా నేర్చుకున్నవే ఎక్కువ 

ఏది చెప్పినా నాలుగు మాటలలో జీవిత సత్యాన్ని విలువలని 

అతి సుళువుగా ఏదో ఒక నానుడిలేదా 

సామేతతో జోడించి చెప్పేవారు . 

నాన్న ప్రశాంతత నిర్మలత్వం మంచితనం సహనం

 నిరంతరం నన్ను స్పర్శిస్తూనే ఉంటాయి

నాన్న వెళ్ళిన తరువాత కూడా తాను ఉన్నట్లే 

భావ పరంపరలు వైబ్రేషన్స్ కలుగుతాయి 

నాన్నకి ఎంతో ఓర్పు అమ్మలో 

ఎప్పుడూ నే చూడని ఓర్పు నాన్నలో కనిపించేది 


నాన్న Archeologist గుళ్ళు ఊర్లు తిరిగేవారు

 అక్కడ ప్రాచుర్యం లో ఉన్న కథలు సేకరించి 

అక్కడి విశేషాలన్ని చక్కగా పూస గుచ్చినట్లు వివరించేవారు 

అలా ఎన్ని కథలు విన్నానో !

ఎన్నో ఏళ్ళ తరువాత  మా పాపకి ఓ సారి కథ చెబుతుంటే 

ఇల్లు చిమ్ముతున్న నేను గడ్డం గీసుకుంటున్న మా వారు

అలాగే చేసే పని ఆపేసి కథ అయ్యే వరకు 

అలాగే శిలలలాగా నిలబడిపోయాము 

ఎవరో "stop" అన్నట్లు  

నాన్న "A Great story  teller " ఇన్నేళ్ల తరువాత కూడా 

అంతే ఉత్కంఠత మాలో కలిగించేలా చెప్పారు 


నాన్న లో కనిపించనిది అహంకారం 

మచ్చుకైనా ఎంత వెతికినా అది  కనిపించేది కాదు 

ఒక రోజు హోటల్లో  డిన్నర్ చేసి  బైటికి  వస్తున్నాము 

డోర్ దగ్గర డోర్ కీపర్ వినయంగా నమస్కారం చేశాడు 

సహజంగా అందరూ  అతనికి డబ్బులు ఇస్తారు 

నాన్న మాత్రం అతనికి చక్కగా చేతులెత్తి నమస్కరించారు 

ఆ నిముషం అందరం నవ్వేశాం  doorkeeper తో సహా 

డోర్ కీపర్ కళ్ళలో మెరుపు నవ్వులో కాస్త సిగ్గు తొణికిసలాడాయి 

ఆ తర్వాత నాకు కూడా అనిపించింది 

నమస్కారానికి ప్రతిగా చేయాల్సింది నమస్కారం కదా 

మరి ఈ దండానికి డబ్బుకి ముడి పెట్టడం అవసరమా ?

అందరం మనుషులమైనా ఒకరిని దండం క్రిందికి జార్చి చులకన చేస్తే 

దానం ఒకరిని పై మెట్టున నిలబెట్టి స్థాయి పెంచుతుంది 


డబ్బు కోసం నమస్కారం 

డబ్బుకి నమస్కారం 

అంతటా నివసించే పరమాత్మకి నమస్కారం 

ఎదుటి వ్యక్తిలో భాసిల్లే ఆత్మారామునికి నమస్కారం 

ఇందులో ఏది ఉత్తమమైన నమస్కారం 

ఇది అర్థమైతే 

నాన్న ఉత్తమమైన సంస్కారం అర్థమౌతుంది 

మనుషుల మాటలలో అవమానాన్ని వెతికే వారు కాదు 

వాళ్ళ మాటలు వారి స్వభావాన్ని,

 పరిస్థితిని , తెలుసుకునే  అవకాశంగా భావించేవారు 


నేను నాన్నకి ఎన్నో చెప్పేదాన్ని 

నాన్నకి ఏమి తెలియదు నాకే అన్నీ తెలుసనుకుని 

నే చెప్పేవి అన్నీ వినేవారు 

"గుడ్డొచ్చి పిల్లనెక్కిరించిందని "

ఇదేంటి నాకు చెప్పేదేంటి 

అని ఎప్పుడూ అనలేదు , అనుకోలేదు 

ఎవరు ఏది చెప్పినా దాంట్లో 

సత్యాన్ని మాత్రమే వెతికే నిరహంకారి 


నాన్నని నేనేమైనా బాధ పెట్టానేమో అని 

మనస్సు చివుక్కుమనేది 

అడిగితే నేనేమి బాధపడలేదులే అని 

నా గిల్ట్  ఫీలింగ్స్ ని కూడా తుడిచిపెట్టేసేవారు  


ఎంత చక్కటి నాన్న 

అందరికీ ఉండనటువంటి నాన్న 

కొందరికి మాత్రమే ప్రాప్తమయ్యేటటువంటి నాన్న 

నాకు నాన్న 

I feel so proud of him and myself 


అమ్మ  తన నలభై తొమ్మిది ఏళ్ళ వయస్సులో 

 ఉన్నట్లుండి 

మృత్యు కుహరంలో మాయమవడంతో 

విధి మా కుటుంబాన్నిసుడిగుండంలోకి నెట్టివేసింది

 నాకు అప్పుడు ఇరవై మూడేళ్లు ,

తమ్ముడు  పదునెనిమిదేళ్ళ వాడు 


మనిషి ధైర్యాన్ని తెలుసుకోవాలంటే 

 జీవితంలో జరిగే దుర్ఘటనలప్పుడే గమనించాలి 

ఇరవై ఐదేళ్లు సహజీవనం చేసిన తన ప్రియధర్మచారిణి 

ఒక్క మాటైనా  తెలుపకుండా వీడుకోలు తీసుకుంటే 

కంట నీరు పొంగకుండా గుండె నిబ్బరంతో తన కర్తవ్యాన్ని పాటించారు 

అందరికి అలా నిలదొక్కుకోవడం సాధ్యం కాదు 


కొందరు ఆశ్చర్యపోయారు కొందరు ఇదేంటి విచిత్రం అనుకున్నారు 

కొందరు భార్య మీద ప్రేమ లేదేమో అని అనుమాన పడ్డారు 

హైందవ వేదాంతం నాన్నకి చేయూత నిచ్చింది 

బాధపడి ఏంలాభం మీ అమ్మ తొందరగా వెళ్ళిపోయింది అంతే అనేవారు 

నాకు అవసరమైన కష్ట కాలంలో చేదోడు వాదోడుగా సహాయపడ్డారు 

అమ్మ లేదనే కొరతని తగ్గించాలనే ప్రయత్నించారు

 చాలా మట్టుకు సఫలీకృతం చెందారు 

కానీ ఎంతైనా కొన్ని పరిస్థితులలో  అమ్మ అమ్మే 

అమ్మ లేని లోటు నాన్న పూర్తిగా తీర్చలేరు 


ఇలా వ్రాసుకుంటూ పోతే నాన్న గురించి 

నా గురించి ఎంతైనా వ్రాయొచ్చు . 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...