నేను భద్రపరచుకున్న ఓ చక్కటి కవిత . ఎవరు లిఖి౦చారో నోట్ చేసుకోలేదు. అందుకు క్షంతవ్యురాలిని.
పరిచయం
నింగి నుండి నేల జారే ఓ అమాయకపు వర్షపు బిందువు
కేవలం ఒక సముద్రపు గవ్వ పరిచయంతో స్వాతిముత్యం అవుతుంటే
ఆదమరచి నిద్రపోతూ కలలుగనే ఓ కమలం కేవలం ప్రభాత వేల
లేత కిరణాల తాకిడికే పులకిత అయి కళ్ళు తెరచి చూస్తుంటే
గ్రీష్మ తాపానికి మొడుపోయిన చెట్లను చూచి మూగవోయిన ఓ కోయిల
కేవలం ఓ మావిచిగురు కమ్మదనం కంఠ౦ తాకగానే గళమెత్తి
మధురంగా పాడుతుంటే
ఉదయం నుండి ఎండవేడిమికి అలసిపోయిన ఓ కలువబాల
కేవలం నెలరాజు కురిపించే వెన్నెల పుప్పొడి జల్లు స్పర్శచేతనే
ఇంతింత కళ్ళతో ఆ జాబిలినే రెప్పవాలక చూస్తుంటే
ఇన్నిన్ని అందాలు సృష్టినుంటే
నీ కోసం అన్వేషించే నా చూపు, నీ కోసం నిరీక్షించే నా కళ్ళు ,
చివరకు నా చిరునవ్వు , నా పలకరి౦పూ,
ఏదీ నీలో స్పందన కలిగించలేనందుకు
కారణం ఏమిటా అని ఆలోచిస్తే
శూన్య౦ నన్నుచూసి వెక్కిరిస్తూ నవ్వింది
మన పరిచయం ఏ అద్బుతమునకు దారి తీయలేదు
ఏ అందమును సృష్టించలేదు
దురదృష్టం నాదే అనుకుందామంటే
అంతరాత్మ అంగీకరించదు
ఆ దురదృష్టం నీదే అనుకుందామన్నా
తిరిగి ఆ అంతరాత్మ నన్నే నిలదీస్తుంది
దేన్ని అంగీకరించలేని సందిగ్ధావస్థలో నేనుంటే
చివరకు కన్నీరు కూడా మౌనంగా నా నుంచి
సెలవు తీసుకుంటుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి