తెలుసా మీకు
కొంగులు
నవ్వు మువ్వల సవ్వడులు చేస్తాయి
అలల సమీరాలై నటిస్తాయి
ఆకాశంలా వర్ణాలు అద్దుకుంటాయి
మెత్తని గులాబి రేకుల స్పర్శను అందిస్తాయి
మరుమల్లెల పరిమళాలను విరజిమ్ముతాయి
నువ్వెప్పుడైనా
ఆ అలికిడి విన్నావా ?
ఆ నాట్యం తిలకించావా ?
ఆ పరిమళాన్ని ఆఘ్రానించావా ?
కొంగులు
మదిలో కొంగొత్త కోరికల తాళం వేస్తాయి
వెచ్చని వలపుల వైనం వివరిస్తాయి
తర తరాల సంస్కృతికి ప్రతీకలై
నిన్నటికి , ప్రస్తుతానికి , రేపటికి ఆనకట్టలు కడతాయి
కాయ కష్టక్షితి సుగంధాన్ని పులుముకుంటాయి
కరిగి కన్నీరైన వ్యథాకళిత గాధలు వినిపిస్తాయి
అలసి చెక్కిట జారే స్వేద సుధా బిందువులని
ఆర్ద్రత తో ఆలింగనం చేసుకుంటాయి
నొసట జారే కుంకుమ రేఖలను సరిదిద్దుతాయి
ఛత్రచామరాలై శీతల వర్షాన్ని ఆపుతాయి
రగిలే సహజాతానికి నుని సిగ్గుల ఆహ్వానాన్ని పంపుతాయి
కన్నీరు మున్నీరైన పసితనపు ధుఖాన్ని అద్ది హృదికి హద్దుకుంటాయి
పసి గమ్యాలై , కన్నెకోరికలై, మాతృత్వపు వేదికలై ఆడతనాన్ని చాటుతాయి
పసి అంగాలని లంగోటిలై రక్షిస్తాయి
తుండు గుడ్డలై దుమ్ము దులుపుతాయి
భాగీరథీ స్రవంతులై మలినాలని కడిగి వేస్తాయి
ఒద్దికైన గోదావరి అందానికి ప్రతిరూపాలై చిలిపి సరాగాలై
స్పందించే మనసుకు రసజ్ఞ ప్రాకృతిక కావ్యాలై మురిపిస్తాయి
నవరసాల మాలికలై ప్రపంచాన కళాకండాలై అలరిస్తాయి
సుస్వప్న గీతికలై మురిపిస్తాయి కలల కౌముదిలో కరిగిస్తాయి
ఊహల ఊయలలో ఊరేగిస్తాయి
ఇన్నిటిని ఎప్పుడైనా ఆస్వాదించావా ?
కొంగులు
వృ షివరులకు తపోభంగం కలిగిస్తాయి
అత్యున్నత వ్యక్తిత్వ పు సౌరభాలు వెదజల్లుతాయి
తత్వ దర్శన నీడలలో మోక్షానికి బాటలు వేస్తాయి
బీడు వారిన జీవితాలకు క్రొత్త చిగురు పూతలు పూయిస్తాయి
దాహార్తితో చేరదీసిన వారికి అమృతాన్ని పంచుతాయి త్యాగాన్ని చవిచూపిస్తాయి
కొంగులు కళ్యాణ తోరణాలై
కౌటుంబిక శుభోదయానికి నాంది పలుకుతాయి
అమ్మవారి శక్తి రూపాలై వంచన, దోపిడి, అవమానాలను ఎదురుకుంటాయి
స్త్రీ అస్థిత్వాన్ని నిలబెడతాయి
తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త